పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0292-2 పాడి. సం: 09-248

పల్లవి:

ఎఱిఁగి వుందువుగాని యిందరివలెఁ జూడక
మఱవరానియట్టి మానాపతి సుమ్మీ

చ. 1:

చెలిచేత మాటాడంచి సిగ్గువడి నీతోను
తలుపుమాఁటుననుండె తరుణి యదె
బలిమి నీ వంతలోనె పైకొనఁగా లోనాయ
యిలువెళ్ల రానియట్టి యిల్లాలుసుమ్మీ

చ. 2:

వొడికాన విడెమిచ్చి వున్నతిఁ జేతులుచాఁచి
కడపలోననె వుండి కాంత యదె
చిడుముడి నీ వంతలో చేపట్టఁగా లోనాయ
కడుముద్దరాలైన ఘనురాలు సుమ్మీ

చ. 3:

చేవదేర నిన్ను నదె చిలుకచేఁ బిలిపించి
వోవరిలోఁ బానుపుపై నుండి మగువ
నీ వంతలో లోనికేఁగి నెమ్మిఁ గూడఁగా లోనాయ
శ్రీవెంకటేశుఁడ యీపె చిన్నికన్నెసుమ్మీ