పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0292-1 మంగళకౌశిక సం: 09-247

పల్లవి:

ఏల రట్టు సేసే వేమీ నేఁడు
చాలుఁ జాలు మాయెడను సటసేయవలదు

చ. 1:

పెదవుల మమ్మింతేసి పేరఁ బిలువకు మని
మొదల నిందుకుఁగానె మొక్కనా నీకు
అదనఁ గోపమున నీ యంకెకు రాకుండుదుము
యెదుట నప్పుడు నీవు యెగ్గు లెంచవలదు

చ. 2:

కన్నుల నవ్వకు మని కాఁకలు సేయకు మని
నున్నని చెక్కులు చేతనొక్కనా నేను
పన్నిన పంతములను పరాకున నుండుదుము
వన్నెల నీ వంతేసి వాసు లెంచవలదు

చ. 3:

పచ్చిసేసి నీవు మమ్ము బలిమిఁ బట్టకు మని
చెచ్చెర నీకుఁ బ్రియము చెప్పనా తొల్లె
యిచ్చల శ్రీవెంకటేశ యిటు నిన్నుఁ గూడితిమి
తచ్చనలుగావు యిఁకఁ దమకించవలదు