పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0291-4 కొండమలహరి సం: 09-244

పల్లవి:

అన్నిటా నేఁ దనిసితి అందరును మెచ్చిరి
మన్ననలు తుదకెక్కె మాట లింకేలయ్యా

చ. 1:

యెప్పుడు వత్తువో యని యెదురు చూచినందుకు
చొప్పుతో నీ వున్నందుకు జోకలాయను
రెప్పలెత్తి చూచితేనె రేసువడె నామనసు
కప్పిన వేడుకలకు కడమలేదయ్యా

చ. 2:

బత్తిగలవని నేను భామలతో నన్నందుకు
తత్తరపు నీ చేఁతకు తగవాయను
మెత్తనైతి నీయడకు మేలములు నమరెను
యెత్తి నీతో నున్న సుద్దు లేలచెప్పేనయ్యా

చ. 3:

పొదిగి నే నీతోను పొందులు సేసినందుకు
యిదె నీవు గూడినందు కితవాయను
యెదిగి శ్రీవెంకటేశ యిరవైతిఁ దరవైతి
కదిసి నీరతులకుఁ గడమయేదయ్యా