పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0291-2 గౌళ సం: 09-242

పల్లవి:

ఆతఁడు నీవు నొక్కటె అందరు నెఱుఁగుదురు
మాతోనె యింతేసి మతకమేలె నీవు

చ. 1:

తప్పక వొట్లువెట్టి దగ్గరి రమ్మనే వేమె
చెప్పరాదా నీ మాట సేసేఁ గాని
నెప్పున నాతఁడున్నాఁడు నే నెరఁగనా నీ వొద్ద
చెప్పక నాతో మాయలు సేయనేలె నీవు

చ. 2:

వట్టి యాకతాలు చెప్పి వద్దికి దగ్గరే విదె
అట్టె వుండరాదా అన్నినయ్యీఁ గాని
తట్టి ఆతని ముదుల తచ్చనగాఁబోలు నిది
నట్టనడుమనె యేఁటి నాటకమె నీవు

చ. 3:

యిచ్చకము సేసి నన్ను యెలయించే విన్నిటాను
పచ్చిదేరెఁ బనులెల్ల పదవె యింక
చెచ్చెర నన్ను నలమి శ్రీవెంకటేశ్వఁడు గూడె
వచ్చె నీ పంతములు నవ్వఁగదె నీవు