పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0291-1 శంకరాభరణం సం: 09-241

పల్లవి:

బాపు బాపు మేలు మేలు పంతగత్తె వొదువే
నీ పంతములెల్లదక్కె నేర మేమిగంటివే

చ. 1:

చలము మానినఁ గాక సమ్మతింపించవచ్చునా
పెలుచుఁదనపు నీతోఁ బెనఁగెఁగాక
నిలుచున్నాఁ డాతఁ డదె నే నిన్ను వేఁడుకొనేను
పలుకవు నీవైతే ఫల మేమిగంటివే

చ. 2:

మాటలాడేనంటేఁ గాక మంకు దెలుపవచ్చునా
సాటికి బేటికి నిన్ను సాదించెఁగాక
గీటీ గోర నతఁడు కేలుచాఁచి తీసే నేను
నీటువెట్టుకుందానవు నీ వేమిగంటివే

చ. 3:

నయముగలితేఁ గాక నాయము చెప్పవచ్చునా
దయవుట్టి నేనె నిన్నుఁ దగిలెఁగాక
క్రియఁగూడె శ్రీ వెంకటగిరిపతి నే మెచ్చితి
ప్రియపడే విదె నీవు భేద మేమిగంటివే