పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0290-6 శంకరాభరణం సం: 09-240

పల్లవి:

దొడ్డవాఁడ వవుదువు దొరవూను నవుదువు
జిడ్డులేక వుండేది నీ చిత్త మింతేకాని

చ. 1:

తప్పక చూడఁగవచ్చు తలవంచుకొనవచ్చు
అప్పుడు గాతి కోరి చే దరుదుగాని
తిప్పుచుండవచ్చు మోము తేరకొన నవ్వవచ్చు
యిప్పటివలె నడపే దెక్కు డింతేకాని

చ. 2:

వొగ్గి చెయి చాఁచవచ్చు నుద్దండాలు సేయవచ్చు
కగ్గులేక వలచేది ఘనముగాని
నిగ్గుబాస గొనవచ్చు నెలఁతలఁ బొందవచ్చు
యెగ్గులేక మెలఁగేదె యెన్నికింతేకాని

చ. 3:

మాటలు బోదించవచ్చు మట్టుమీరి దాఁటవచ్చు
పాటించి రతి కెక్కేది భాగ్యముగాని
నీటున శ్రీవెంకటేశ నేఁడు నన్ను నేలితివి
వాటమై యిట్టె వుండేదె వన్నెమించుఁగాని