పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0290-5 సామంతం సం: 09-239

పల్లవి:

నీ వెఱఁగవా నిండుఁ దగవు లివి
కావరంపుఁ బని కాంతకుఁ దగునా

చ. 1:

నిగ్గుల పతి వట నెలఁతను నే నట
సిగ్గువడక నినుఁ జెనకుదునా
యెగ్గులు వట్టితి వెదురురాననుచు
బగ్గన నాఁటది‌ బలిమిసేయునా

చ. 2:

చదురుల దొర వట జవ్వని నే నట
అదనెఱఁగక నిను నలముదునా
కదిమి కొసరితివి గర్వినైతి నని
గుదిగొని కామిని గొరబుసేతునా

చ. 3:

శ్రీవెంకటేశ్వర శ్రీసతి నేనట
సోవగా నవ్వక సొలయుదునా
యీవలఁ గూడితి వియ్యకొంటి నని
కైవసమగు సతి కాదనునా