పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0254-5 శంకరాభరణం సం; 09-023

పల్లవి:

ఇద్దరు మోనాన నున్నా రిది యేమయ్యా
వద్ద నాకె పైకొనీ నీవలెనె పో అయ్యా

చ. 1:

పూచిన తంగేడువలె పొలఁతి దండ నుండఁగ
యేచి కూచుండు మన విది యేమయ్యా
చాఁచి కప్పురవిడెము సరి నీకు నందియ్యఁగ
చేచేత నందుకోవు చెల్లఁబో యేమయ్యా

చ. 2:

ముంగిటి నిధానమై ముదిత వూఁకొనఁగానె
అంగవించి మాటలాడ వదేమయ్యా
బంగారుసురటి నీపై చెమటలు విసరఁగ
అంగ మెల్ల మరచితి వది యేమయ్యా

చ. 3:

నిండిన సంపదవలె నెలఁత ని న్నంటితేను
అండ నో రెత్తలే వైతి వదేమయ్య
మెండగు శ్రీవెంకటేశ మెలుఁత నిన్నుఁ గూడఁగ
యెండ లెల్ల నీడ లాయ నిది యేమయ్యా