పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0254-4 లలిత సం: 09-022

పల్లవి:

పోయిన దెల్లాఁ బొల్లు పూఁచిన దొక్కటె కాక
కాయజకేళికి నింకఁ గదియ రమ్మనవే

చ. 1:

అడిగిరావె విభఁ డందు కేమనీనో
యెడయనిబాస నీకిచ్చినాఁడు
నుడుగులు దప్పినాను నోముఫలము దప్పదు
తడవి యింతటనైన దగ్గరి రమ్మనవే

చ. 2:

పిలిచి రాఁ గదె తనబిరు దెట్టు చెల్లీనో
పెలుచు మే నాహి నాకుఁ బెట్టినాఁడు
వెలయఁ దినఁగ నదె వేమైనఁ దీపవును
తలఁగక యింకనైన దగ్గరి రమ్మనవే

చ. 3:

యిచ్చిరావె యీవిడెము యిన్నిటా మెచ్చితినని
కొచ్చినరతుల నన్నుఁ గూడె నేఁడు
తచ్చిన పక్వాన నంటు తరువఁ దరువ వెన్న
యిచ్చట శ్రీ వెంకటేశు నిట్టె రమ్మనవే