పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0254-4 మంగళకౌశిక సం; 09-021

పల్లవి:

చేరి నీవు చెప్పినట్టు సేసితి నేనూ
వారి వీరివలె మఱవకుమీ నన్నునూ

చ. 1:

జలధి దచ్చి లక్ష్మీని సంగడిఁ బెండ్లాడునాఁడు
అలరి రుక్మిణిఁ బెండ్లి ఆడెనాఁడు
సెలసువిల్లు విఱిచి సీతఁ బెండ్లి యాడునాఁడు
పలికి బొంకనిమాఁటపట్టు నాకు నిమ్మీ

చ. 2:

సరుసఁ బదారువేలుసతులఁ బెండ్లాడునాఁడు
అరసి భూసతిఁ బెండ్లియాడు నాఁడు
పరగ రేపల్లె గోపభామలఁ బెండ్లాడునాఁడు
యిరవై యిచ్చినబాస యిమ్మీ నాకు

చ. 3:

ఆదె శ్రీ వెంకటపతి అలమేలుమంగ నిట్టె
అదన నీవు పెండ్లియాడునాడూ
యిదె నన్నుఁ గూడితివి యెక్కువగా మన్నించి
యెదుట నమ్మించినవి యెంచుమీ నాకు