పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0254-2 ముఖారి సం: 09-020

పల్లవి:

కూడని దొకటొకటి కోరీ మరుబలము
ఆడనె నీసతి కన్నియుఁ గూడె

చ. 1:

పొంగెటిమనసే వెలిపులక మొలకలు
అంగపుఁ జెమట మోహపుఁ గరఁగు
వెంగలితమకములు విసరెటి వూర్పులు
అంగన కిదివో అన్నియునుఁ గూడె

చ. 2:

యెనసిన యాసలె యెదురుల చూపులు
అనుగుఁ గూరిములె ఆలకింపులు
నినుపు మోమోటములె నిండిన నివ్వెరగులు
అనయము సతి కిప్పు డన్నియునుఁ గూడె

చ. 3:

కాఁగిటిపరవశాలు కన్నులతేలింపులు
చేఁగల సిగ్గులె చిరునవ్వులూ
యీగతి శ్రీ వెంకటేశ యింతలో విచ్చేసి చెలి
నాఁగి కూడఁగా నివి యన్నియునుఁ గూడె