పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0254-1 మంగళకౌశిక సం: 09-019

పల్లవి:

దవ్వులసరసములు తగునా నీకు
వువ్విళ్లె మేన నొచ్చమున్నవానివలెను

చ. 1:

గోడ నిక్కి చూచేవు గొబ్బున దగ్గరి రావు
ఆడనుండె యెడమాట లాడించేవు
వీడెపు నీమోవి చూపి వికవిక నవ్వేవు
కూడి ముట్టువారి ముట్టుకొన్నవానివలెను

చ. 2:

యెదుట సన్నలు సేసే వేకతము లాడేవు
పొదిగి నే రమ్మంటేఁ బొందు చూపేవు
బెదరేవు నీమేను పెనుగోర నంటితేను
చెదరి చీఁకటితప్పు సేయువాని వలెను

చ. 3:

అలికేవు వులికేవు అంతలోన భ్రమసేవు
వెలయ నిలువుననె వెరగందేవు
యెలమి శ్రీ వెంకటేశ యీడకు విచ్చేసి నీవు
కలసితి విదె కలగన్నవానివలెను