పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0253-6 భూపాళం సం: 09-018

పల్లవి:

మూలనున్నవారి మమ్ము ముంగిటవేసీఁగాక
జోలి దవ్వీఁగాక నే సోదించఁగలనా

చ. 1:

వెన్నెలలె యెండలంటా వేగించె తనకుఁగాను
నన్ను నవ్వీఁ దనతో నే నవ్వఁగలనా
చిన్నిచెమటలవాన చిత్తడిపాలైననా
చన్ను లంటీఁ దన్ను నే జంకించఁగలనా

చ. 2:

పాయ మిది భారమంటాఁ బలికె నాతో మాట
లాయము దాఁక నాడీ మారాడఁగలనా
కాయంపుఁ బులకలచే గజిబిజియైన నాపైఁ
జేయి వేసీఁ దన కిది చెల్ల దనఁగలనా

చ. 3:

నిమిషమె యుగమై నివ్వెరగైన నన్నుఁ
దమి నడియాస ముంచీఁ దాళఁగలనా
సమరతి ననుఁ గూడె జంట శ్రీ వేంకటపతి
కమలపుటింతి నింతేఁ గాదనఁగలనా