పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0253-5 ముఖారి సం: 09-017

పల్లవి:

మగువ నేను నీవు మగవాఁడవు
తగ దొక్కజాతి గాదు తలవయ్య నీవు

చ. 1:

వేఁకపు వెన్నెలముగ్గు వేడుక నామోము నిగ్గు
చీఁకటినీలపుగీము జిగి నీమోము
యేఁకట నీకును నాకు నేఁటిపొందు నన్నంత
తాఁకనాఁడవద్దు వద్దు తలవయ్య నీవు

చ. 2:

కలువరేకులముంపు కలికి నీకనుసొంపు
జలజపురూపు నీ చాయలచూపు
యెలమితో నిందు కందు కేవూరి కేవూరు
తొలఁకు గచ్చులు మాని తొలవయ్య నీవు

చ. 3:

తనరుఁ గొండల తరతరము నావురము
మినుకువజ్రపుటేను మించు నీమేను
ఘనుఁడ శ్రీ వెంకటేశ కలయు నీరతులలోఁ
దనిసి నే నొక్క టైతిఁ దలవయ్య నీవు