పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0253-4 లలిత సం: 09-016

పల్లవి:

కల దింతె మాఁట కంతుని యాఁట
తెలుసుకో నీలోనిదియె పూఁటపూఁట

చ. 1:

అలమేలుమంగా హరియంతరంగా
కలితనాట్యరంగ కరుణాపాంగ
చెలువుఁడు వీఁడె చేకొను నేఁడె
వలరాజుతూపులివి వాఁడిమీఁది వాఁడి

చ. 2:

అలినీలవేణి యంబుజపాణి
వెలయంగ జగదేకవిభునిరాణి
కలయు నీ పతి వచ్చె గక్కన నిన్నిదె మెచ్చె
పలికీని చిలుకలు పచ్చి మీఁదఁబచ్చి

చ. 3:

సితచంద్రవదనా సింగారసదనా
చతురదాడిమబీజచయరదనా
యితవైన శ్రీ వెంకటేశుఁడు నిన్నిదె కూడె
తతిఁ దలపోఁతలు తలకూడెఁ గూడె