పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0253-3 దేవగాంధారి. సం: 09-015

పల్లవి:

అతిరాజసపు దొరవైన నిన్నును
సతమైన నే నిట్టె సాదించవచ్చునా

చ. 1:

వెడఁగు నీ సుద్దులెల్ల వీనుల వినుటగాక
నొడిగి నిన్నవి నే మానుపవచ్చునా
కడఁగిన చేత లెల్ల కన్నుఁజూచుటగాక
అడఁచి నీతో నౌఁగా దనవచ్చునా

చ. 2:

పచ్చి నీగుణములకు పరిణామించుటగాక
కెచ్చురేఁగి బొమ్మల జంకించవచ్చునా
తచ్చిన నీ యెమ్మెలకుఁ దలవంచుకొంటగాక
వొచ్చమని నిన్ను మెచ్చకుండవచ్చునా

చ. 3:

దక్కిన నీకాఁగిటను తనివి నొందుటగాక
చక్కని నిన్ను నేఁ గొసరవచ్చునా
అక్కున శ్రీ వెంకటేశ అలమేలుమంగనేను
యెక్కువ నీరతు లివి యెంచవచ్చునా