పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0290-2 భైరవి సం: 09-236

పల్లవి:

వాకిట నే లున్నాఁడవు వనితమాటలె యివి
లోకులు మెత్తురు నిన్ను లోనికిరావయ్యా

చ. 1:

అంగనపాదంబుల అందెలు మెట్టెలునె
సంగతి నిన్నుఁ బిలిచీఁ జాలదా యిది
యెంగిలినోటఁ బిలిచే దెగ్గనివుంటే నీవు
అంగవించి లోనికిరా వదియేమయ్యా

చ. 2:

కంకణసూడిగములె కడు నీతో మాఁటలాడీ
యింక ననుమానము నీ కేఁటికి నేఁడు
పొంకపు మొనదంతాలు పూఁచి ప్రియముచెప్పదు
అంకెలఁ బానుపు మీఁద నట్టె కూచుండవయ్యా

చ. 3:

మొలనూలిగంటలనె ముచ్చట నీతో నాడీ
యెలమి శ్రీవెంకటేశ యియ్యకోరాదా
మెలఁగి పెదవితేనె మీఁదు నీ కెత్తుకున్నది
కలసితి నాపె నిట్టె కంటివిగదయ్యా