పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0289-5 గౌళ సం: 09-233

పల్లవి:

ఏఁటికయ్య మాఁటలు యింకా తాటతూఁటలు
యీటువెట్టుకొని నిన్ను నే మనేము నేము

చ. 1:

చెంగట నీవు సేసిన చేఁతలు లే వనఁగాను
అంగమెల్లఁ జెమరించె నందుకుఁగానె
సింగారపు నీ మేని చిందువందు లెల్లఁ జూచి
యింగితానఁ బులకించె నిందుకుఁగానె

చ. 2:

నెట్టునఁ గొత్తలుగొన్ని నేరుచుక వుండఁగానె
అట్టె వుసురంటి నే నందుకుఁగానె
వొట్టువెట్టుక నిన్ను వొడివట్టి తియ్యఁగాను
యెట్టకేల కియ్యకొంటి నిందుకుఁగానె

చ. 3:

గక్కనఁ గాఁగిట నన్నుఁ గాఁగిలించి కూడఁగానె
అక్కరతో నియ్యకొంటి నందుకుఁగానె
మక్కువ శ్రీవెంకటేశ మంచితనాలు సేయఁగ
యిక్కువలంటి మొక్కితి నిందుకుఁగానె