పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0289-3 సాళంగనాట సం: 09-231

పల్లవి:

చేతికి లో నైనప్పుడు చెప్పేఁగాని
యేతుల సెలవి నవ్వు లీడ నేలా

చ. 1:

ముంగిట నే నుండఁగాను మోహించి చెనకేవు
అంగడిచుట్టరికాలు అవియాల
రంగుగా నీవున్నచోటు రాతిరే వింటిమి నేము
యెంగిలి పొత్తుల మాట లీడ నేలా

చ. 2:

వొంటి నే నుండఁగాను వొడివట్టి పెసఁగేవు
కంటిఁ గంటి గురుమ కత లేల
వుంటిమి నీవన్నిటాను వొరపరి వౌదువు
పెంటపట్టు సరసాలఁ బెనఁగ నేలా

చ. 3:

కదిసి నే నుండఁగానె కౌఁగిటిఁ గూడితివి
పొదుగుడువలపుల పొదు లేల
అదివొ శ్రీవెంకటేశ అన్నిటాఁ జొక్కితి నేను
అదనైనప్పుడె జోహా రన నేలా