పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0289-1 ముఖారి సం: 09-229

పల్లవి:

ఎంతలేదు మాటలు యేడ కేడ సుద్దులు
యింతవాఁడ వౌత నిన్ను నెరఁగనా నేను

చ. 1:

యెక్కడనుండోవచ్చి యిచ్చకము సేసి నా
చెక్కులు నొక్కినదె సెలవా నాకు
వొక్కమాటె నవ్వు నవ్వి వొడివట్టి తీసి నన్ను
తక్కులఁ బెట్టినదె తనివారెనా

చ. 2:

నిద్దుర గంటికిరాఁగా నీ చేఁతలు దాఁచుకొంటా
వద్దఁ గూచుండినదె వరుసా నాకు
సుద్దులెల్లఁ జెప్పి చెప్పి చొక్కులఁ బెట్టుచు నాతో
పొద్దున మంచ మెక్కితె పొందికాయనా

చ. 3:

వేడుకలు దైవార వేసాలకుఁ బొగడుతా
యీడ నన్నుఁ జెనకేదె యీడె నాకు
కూడితి శ్రీ వెంకటేశ గుణ మెరిఁగి నన్నిట్టె
జోడువాయ కుండితేనె సోద్యమాయనా