పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0288-5 ముఖారి సం: 09-227

పల్లవి:

కూరిమిఁ గొసర నేల కొంక నేల
బీరముతో నుండుఁగాక పెనఁగంగ నోపమే

చ. 1:

సంగడిఁ గూచుండనేల జగడ మాడఁగనేల
వుంగిటి నివ్వలిమోమై వుండేమె నేము
ముంగిటఁ దా రమణుఁడు ముసి ముసి నవ్వులతో
రంగుమీరి వుండుఁగాక రవ్వసేయ నోపమే

చ. 2:

యింటికిని రానేల యెగసక్కె మాడనేల
వొంటినైనాఁ బానుపుపై నుండేమె నేము
జంటలై తా నందరితో సరసము లాడుకొంటా
వెంట వెంట రానీవె వేసరించ నోపము

చ. 3:

తప్పక చూడఁగనేల తమకించ నింతయేల
వొప్పగు నివ్వెరగుతో నుండేమె నేము
అప్పటి శ్రీవెంకటేశుఁ డాతఁ డిట్టె నన్నుఁ గూడె
వుప్పటించి వూరడించి వొద్దఁ బాయ నోపము