పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0288-3 హిందోళం సం: 09-225

పల్లవి:

అందాఁకా వేగిరమా ఆఱడికాఁడ
చిందేవు మాటలఁదేనె చెల్లు నీకు నయ్యా

చ. 1:

నవ్వుతా నే నుండఁగానె నంటున గిలిగించేవు
అవ్వల నీ కింకా నెంత ఆసోద మోయి
పువ్వువంటి నావయసు పూఁచి నీపైఁ జల్లఁగానె
తవ్వేవు జాణతనాలు తమకి వౌదువు

చ. 2:

దగ్గరి నే నుండఁగానె దండకు నొత్తుకొనేవు
వెగ్గళించి నీకెంత వేగిరమోయి
సిగ్గుదేరి నీ మీఁద చేతులు నేఁ జాఁచఁగానె
వొగ్గి కాఁగిట బిగించేవు వుబ్బుకాఁడ వౌదువు

చ. 3:

కలసి నే నుండఁగానె కమ్మి రతికిఁ దీసేవు
లలి శ్రీవెంకటేశుఁడ లావరి వోయి
యెలమి నన్నేలితివి యియ్యకొంటి నే నట్టె
పలుకుఁ బంతము చెల్లె పనివాఁడ వౌదువు