పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0288-2 లలిత సం: 09-224

పల్లవి:

ఎక్కడి సుద్దు లేలె యిది గొంతా
చిక్కితి నీపాలను విచ్చేయవయ్య లోనికి

చ. 1:

చింతలేక నీకు నీవె సేసిన సేఁతలకును
యెంత నేము దూరినా నీకేఁటి వెరపు
చింతించ నీ కేఁటికి చెక్కుచేయి యేఁటికి
వింతవార లిదిగంటే వేసా లనరా

చ. 2:

దెప్పరాన నీవు లోలోఁ దిరిగే తిమ్మటలకు
యిప్పటి మా యలుకలు యేడ కెక్కును
రెప్ప లెత్తి చూచేవు రేసువడి యున్నాఁడవు
యిప్పటి నీజాడలెల్లా యెగసక్కే లనరా

చ. 3:

కదిసి నీ మేనను కల్ల లెన్ని దోఁచినాను
యెదుట నున్నాఁడవు నిన్నే మనేము
అదన శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
చదురుఁడ విన్నిటిను జాణవు నీ వనరా