పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0288-1 సామంతం సం: 09-223

పల్లవి:

అప్పటినన్నె కొసరీ నదివో ఆపె
నెప్పున నన్నిపనులు నీకె తెలును

చ. 1:

తెగరానిచోట వాదుదీసి యెంతమాటాడిన
పగలేదు చనవుల బలిమె కాని
మగవాఁడ వందుమీఁద మట్టు పడనోపుదువు
తగవులు మమ్మేల యిత్తరి నడిగేవు

చ. 2:

వలచినవారు పై పై వాసులెంత నెరపిన
చలములుగావు రతిచవులె కాని
బలువుఁడ వందు మీఁద పనిగొన నోపుదువు
చలివాసి మమ్మేల సాకిరివెట్టేవు

చ. 3:

ఆరితేరిన దంపతు లాయము లెం తంటినాను
నేరుపులేకాని అందు నెగులులేదు
కూరిమి శ్రీవెంకటేశ కూడితి వందుమీఁదను
నారుకొన మాతో నేల నవ్వులు నవ్వేవు