పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0287-5 మంగళకౌశిక సం: 09-221

పల్లవి:

దయఁదలఁచుక నేనె తగిలి కూడితి నిన్ను
క్రియ చూపక నే నుంటె గెంటించఁ గలవా

చ. 1:

నంటున నీతో నేను నగఁగానె సందుకొని
అంటు ముట్టి సరసము లాడేవు గాక
జంటమాటలాడక చలపట్టి నే నుండితే
వొంటినే సాదించి నన్ను వొరయఁగఁ గలవా

చ. 2:

పొత్తుకుఁ బిలిచి నేనె పొదుగఁగానె నీవు
హత్తుక నీ వింతేసి పొంధై తివి గాక
గుత్తపు నాగుణముతో గుట్టు సేసుక వుండితె
చిత్తగించి నీ చలము చెల్లించుకోఁ గలవా

చ. 3:

చేయి చాఁచి నే నిన్ను చెనకి కాఁగిలించఁగా
యీయడ నన్ను నేఁడె యేలితి గాక
చాయల శ్రీవెంకటేశ సరికి బేసికి నీతో
మాయలు నేఁజేసితేను మారు కొనఁగలవా