పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0287-4 భైరవి సం: 09-220

పల్లవి:

ఆఁటదానికి పతితో నంతచెల్లునా
చీటికి మాటికి యంతసేసేవె నీవు

చ. 1:

పట్టినదె చల మని పంతములె నెరుపేవు
అట్టె యాతని ప్రియము లంగవించవు
చిట్టకాలు వద్దనిన చెలుల మాటలు చెవిఁ
బెట్టవు నీకుఁ దగిన బీరములె కాని

చ. 2:

ఆడినదె మాటసేసి యట్టె నిలువఁ బెట్టేవు
జోడుగా నాతని మాట చొరనియ్యవు
తోడనె నే మిద్దరి చేతులుఁ బట్టికూరిచిన
కూడియుఁ గూడవు నీ గుణములె కాని

చ. 3:

మొదలివొట్టుకు నీ మొనలు చూపేవు గాని
అదనైన మీఁద నింక నటు మెచ్చవు
యిదివో శ్రీ వెంకటేశుఁ డిదె నన్నుఁ గూడినాఁడు
చదురు లింకా నీవు సాదించేవు గాని