పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0287-3 రామక్రియ సం: 09-219

పల్లవి:

ఏల నీవు చిన్నఁబొయ్యే వేఁటి కానలు వెట్టేవు
జాలిఁ బెట్టి బొమ్మలను జంకించేనా

చ. 1:

అలిగి నీతో మాటలాడ కెంతవుండినాను
చలములు గడు నేము సాదించేమా
నిలిచి నేఁ గడు నిన్ను నేరము లె న్నెంచినాను
బలుములు చూపి యిట్టె భ్రమయించేమా

చ. 2:

యెనయక కోపాన నే యింటిలోనె వుండినాను
వెనక నీ చేఁతలు నేవెళ్ల వేసేనా
మనసునఁ గాఁతాళించి మంకులు నే నెరపిన
పెనఁగి పిలిచి నీతో బీరము లాడేనా

చ. 3:

పదరి నీతో నెంత పంతము నే నాడినాను
అదన నిన్నుఁ గూడక అలయించేనా
యెదుట శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గలసితి
వుదుటున నే నీతో నోప ననేనా