పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0286-6 మంగళకౌశిక సం: 09-216

పల్లవి:

సవతుల కెల్ల నీవు చాటి చెప్పింతువు గాక
నవకాన మూలనుంటె నమ్మేరా దేవులని

చ. 1:

ఆతనివద్ద నుంటె నీ వాల వని యందుఁ గాక
యీతల నీ వెట్టుండినా నెవ్వ రందుము
యేతులకు నీవు మాతో నెరుకలు సేసుకొని
బూతులఁ దిట్టితేనె నీ పొందు గానవచ్చునా

చ. 2:

ముచ్చట మీరాడుకొంటే మోహాలు గందుము గాక
పచ్చి గుట్టున నుంటె నీ భావ మెందుండు
మచ్చిక నీ చనవులు మా ముందర మెరయించి
కొచ్చి యాతనిఁ జూచితే గుట్టు గానవచ్చునా

చ. 3:

కాఁగిట శ్రీవెంకటేశుఁ గాఁగిలించుకొంటెఁ గాక
ఆఁగి నీవూర కుండితే నందములౌనా
చేఁగదేర నన్నుఁ గూడె చేరి యాతఁడని నీవె
రాఁగి నీలోనె నవ్వితే రచ్చలకు నెక్కునా