పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0286-5 ముఖారి సం: 09-215

పల్లవి:

ఎఱఁగని యాఁటదయితే యిది నిజమంటా నమ్ము
నెఱయ మాతో నిజమే నెరపవలయురా

చ. 1:

యెదుటనె వలపు యింటికాడ బులుపు
వదల కేడ నేరిచి వచ్చితివిరా
పెదవులపై మాట బిగువులలో తేట
సదరమై నీకెపుడు సాజమే కదరా

చ. 2:

చెనకితే సిగ్గులు చేఁతలనే యెగ్గులు
ననుపున రెండూ నెట్టు నడపేవురా
మునుపనె మొక్కులు మోచి వచ్చితె తెక్కులు
పొనిగి నీవు పుట్టఁగఁ బుట్టినవే కదరా

చ. 3:

మెచ్చితేనె మేకులు మీరితేనె కూకులు
యిచ్చకొలఁది నడతు వేమందురా
ముచ్చట శ్రీవెంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
చెచ్చెరఁ బరులకైతె సేతువు మాయలురా