పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0286-4 లలిత సం: 09-214

పల్లవి:

ఎవ్వరి బుద్దులు యెక్కడి కెక్కును
నవ్వులె జాణల నను పయ్యెడివి

చ. 1:

పంతము లాడరు బలుములు చూపరు
వంతు లెంచ రటు వలపులకు
సంతసంబులునుఁ జవు లగు సరసము
లెంతైన లోలో నెర వయ్యెడివి

చ. 2:

వేసట చూపరు వింతలు సేయరు
వాసులు నెరపరు వలపులకు
ఆసల తమకము అంగపుఁ గరఁగులు
తాసులవలెనే తగు లయ్యెడివి

చ. 3:

గుట్టున జడియరు కొంకుచు మొరయరు
వట్టువోరు తమ వలపులకు
యిట్టె శ్రీవెంకటేశ మీకూటమి
నెట్టన రతులివె నిలిచినవి