పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0286-2 రామక్రియ సం: 09-212

పల్లవి:

ఎటువంటి చుట్టరిక మెటువంటి పొందులు
నటవటలకు నేల సాదించేవే

చ. 1:

అప్పటినుండియు నీ అండ నిట్టెవుండఁగాను
రెప్పలెత్తి చూచి చూచి రేసు లాడేవు
చెప్పినవారిమాటకు చెవియొగ్గి విని విని
తప్పుఁదారుల నేల తమకించేవే

చ. 2:

మనసిచ్చి నే నీతో మాట లిట్టె ఆడఁగాను
వెనకసుద్దుల కేల వెంగె మాడేవే
తనిసి వొకటొకటె తలఁచుక తలఁచుక
పెనఁగి నేఁ బిలువఁగ బిగిసే వేలే

చ. 3:

కందువ లంటి నేను కాఁగిలించి కూడఁగాను
చందపు బొమ్మల నేల జంకించేవే
చెందితి నిదివో నిన్ను శ్రీవెంకటేశుఁడ నేను
అందిన రతుల నేల అలయించేవే