పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0285-6 మాళవి గౌళ సం: 09-210

పల్లవి:

ఈతఁడు వద్దనుండఁగ యేల యెమ్మెలు చెప్పేరే
గాతల మగలవద్ద గర్వములు గలవా

చ. 1:

చెంగట మామొగమున చేరఁడేసి కన్నులంటా
అంగన లందరు నన్ను నాడుకొనేరే
పంగించి మానెరులివి బారెఁడేసి ఆయనంటా
వుంగిటిగా సారె నేల వుప్పతించేరే

చ. 2:

పంతాన నాకుచములు బంగారుకుండలంటా
బంతినుండి చెలులేల పచ్చారేరే
యింతలో నాపిరుఁదులు యిసుక దిబ్బెములంటా
రంతులుగాఁ గడు నేల రాఁపు సేసేరే

చ. 3:

పొంచి నా రూపమిది పుత్తడిఁ బోలునంటా
యెంచి యెంచి మమ్మునేల యింతసేసేరే
అంచల శ్రీవెంకటేశుఁ డన్నిటా నన్నుఁ గలసె
మించుగాఁగ మమ్ము నేల మెరయించేరే