పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0285-4 శ్రీరాగం సం: 09-208

పల్లవి:

ముట్టితేనె ముయిముచ్చటలూ
ఱట్టు సేయ నాఱడిదాననా

చ. 1:

గక్కన నీతనిఁ గన్నులఁ జూచిన
పిక్కటిల్లె నిదె పెంజెమట
చెక్కడచితేను చేటఁడు వలపులు
వొక్కమాటె నే నోపుదునా

చ. 2:

నవ్వి యితనితో ననుపులు సేసిన
పువ్వకపూచెను పులక లివి
రవ్వగాఁ బెనఁగితే రాసెఁడు తమకము
జవ్వనము మోవఁ జాలుదునా

చ. 3:

కాఁగిట నితనిఁ గలసితి నిందుకు
చేఁగలు దేరెను చిత్తమిది‌
వీఁగఁ డితఁడు శ్రీవెంకటేశ్వరుఁడు
నీఁగని చలములు నేరుతునా