పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0285-2 ముఖారి సం: 09-206

పల్లవి:

ఏమిటికి వేఁడుకొనే వింతలోఁ దమకించేవు
కామించి నీ వాడినట్టు కాదంటినా

చ. 1:

మచ్చరములెల్లఁ దీరె మంతనాన నీవు నాతో
యిచ్చకము లాడితేనె యియ్యకొంటివి
కుచ్చి కాఁగిలించి నాచెక్కులు నొక్కే వేమిటికి
నిచ్చలు నీచెప్పినట్టు నేఁ జేయనంటినా

చ. 2:

ఆనలెల్ల విడిచితి నంటఁబట్టి నీవు నాకు
తేనెమోవి యిచ్చితేనె తిరమైతివి
పూనిక నా కొంగువట్టి పొంచి యాలపెనఁగేవు
వూని నీతో పొందులు నే నొల్లనంటినా

చ. 3:

మంకు లన్నియుఁ దొలఁగె మనసుమర్మములంటి
సంకెలు దీరిచితేనె సమ్మతించితి
కొంకక శ్రీవెంకటేశ కూడి యింకాఁ బొదిగేవు
పొంకమైన మీఁదాఁ దప్పులు వట్టేనా