పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0285-1 సామంతం సం: 09-205

పల్లవి:

నిందలేని పతి విదె నీవు నాసొమ్ము
కందువ సొమ్ములమీఁదఁ గలిగెను సొమ్ము

చ. 1:

సూటిగా నీవు చూచేటి చూపు నాసొమ్ము
పాటించి నీవు పలికేపలుకు నాసొమ్ము
కూటమిరతుల కొనగోరు నాసొమ్ము
యీటున నీమేనిసొమ్ము లిచ్చేవు నాకు

చ. 2:

చవిగా నాడే నీ సరసము నాసొమ్ము
జవకట్టక యిచ్చే నీచనవు నాసొమ్ము
నవకమయిన నీనవ్వు నాసొమ్ము
యివల నింకా సొమ్ము లిచ్చేవు నాకు

చ. 3:

కింకలేని దిదే నీకాఁగిలి నాసొమ్ము
లంకెలైన నీమతివలపు నాసొమ్ము
అంకెల శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యింకా సొమ్ము లిచ్చేవు యెన్నియైనా నీవు