పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0284-6 బౌళి సం: 09-204

పల్లవి:

ఎవ్వరితోనైనాఁ జేయుమీ మాయలు
రవ్వలఁ బెట్టఁగ నేము రాఁపువారమా

చ. 1:

తక్కక నీవు మాపై తలఁపు గలితేఁ జాలు
అక్కడ యిక్కడె కాదా అందు కేమీ
చొక్కులఁ బెట్టుచు మాతో చుట్టరికము నెరప
వెక్కసాన నేఁడు నీకు వింతవారమా

చ. 2:

పొద్దుపొద్దు మా ముంగిటఁ బొలసి వుండితేఁ జాలు
యిద్దర మొక్కటె కాదా యిందు కేమీ
కొద్దిమీర నీవు మమ్ముఁ గొంగువట్టి తీసేవు
గద్దీంచి నీతోఁ బెనఁగ కడవారమా

చ. 3:

సమరతిఁ గూడితివి సారెకుఁ బొగడవద్దు
తమక మొక్కటె కాదా దాని కేమీ
అమరె శ్రీవెంకటేశ అన్నియుఁ గడపలోన
జమళిబాస లియ్య మెచ్చనివారమా