పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0284-5 సామంతం సం: 09-203

పల్లవి:

నేనే యెరుఁగుదును నీవూ నెరుఁగుదువు
పూనిన రుత్తమాటలు భూమి నెన్నిలేవురా

చ. 1:

తలఁచినట్టె నీవు దగ్గరి విచ్చేసితివి
వలపు లంటె నిటువలె నుండురా
సొలసి నేఁ జూడఁగానె చూచితివి నీవు నట్టె
యెలమి లోలోని యాస కిది దిష్టాంతమురా

చ. 2:

ననిచి నానవ్వులు నీనవ్వులు నొక్కటాయ
యెనసిన యింపులకు నీగురుతేరా
వొనర నిద్దరికిని వొక్కమాటే పులకించె
తనువు లొక్కటౌటకు తారుకాణ లివిరా

చ. 3:

రాణించి నేఁ గోరినట్టే రతి నీవు సేసితివి
ప్రాణము లెరవుగాని భావ మిదిరా
జాణవు శ్రీవెంకటేశ జంటవాయ మిద్దరము
నాణెపు వేడుకలెల్ల నాకు నీకె తగురా