పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0284-3 పాడి. సం: 09-201

పల్లవి:

ఇట్టి నీకు వలచిన యింతిదె జన్మముగాదా
వట్టి మోహించినవారి భాగ్యమవె కావా

చ. 1:

నీవు మన్నించేటి యట్టి నెలఁతల కెల్లాను
తావుల లీలారవిందమవె కావా
భావింప నీచూపులు వారినవారి కెల్లా
ఆవటించి మెడకంఠహారమవె కావా

చ. 2:

కప్పురపు బళ్లందిన కాంతలకెల్లాను(?)
కప్పిన శిరోవణికమమె కావా
చొప్పుగా నీపాదాలు సోఁకినవారికెల్లా
కప్పమైన ముంజేతి కంకణమవె కావా

చ. 3:

కోరి నీవు కాఁగిటిలోఁ గూడుండె సతుల కెల్లా
నారుకొన్నయట్టి నిధానమవె కావా
యీరీతి శ్రీ వెంకటేశ యెనసి నన్నేలితివి
తేరకొన నాపాలి దేవుఁడవె కావా