పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0283-5 ఆహిరి సం: 09-197

పల్లవి:

ఇంతకంటె వలపు నేనేమి చెప్పేను
కాంతుఁడవు నీవె యింకాఁ గనుకోవోయీ

చ. 1:

అంతరంగములోనను ఆయము నీచింత నాకు
బంతి నీమాటలె చెవులపండుగ నాకు
సంతమైన సరసాలె జగమెల్లా నేలుట
వింత వింత చనవులె వేవేలు విధులు

చ. 2:

కన్నులకు నీరూపు కామనిధానము నాకు
పనిన్న నీ చనవులె పంటలు నాకు
మన్ననల నగవులె మంచి కప్పురవిడేలు
మున్నిటి పొందుల సిగ్గు ముత్యాలసేన

చ. 3:

మేనికి నీకాఁగిలి మెత్తని పరపు నాకు
తానకపు నీరతులె తగుభోగాలు
మానక శ్రీవెంకటేశ మరిగి నన్నుఁ గూడితి
నానెటి చెమట లివె నవరసాలు