పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0283-3 పాడి సం: 09-194

పల్లవి:

ఎప్పటివాఁడవె కావా యెరఁగఁ గాకా
చిప్పిల నేనే మరచితిఁ గాని

చ. 1:

యింగితము చూచి నీ విటువంటివాఁడ వని
అంగనలు నాతోఁ జెప్పి రల్లనాఁడె
సంగడి నేనే నిన్ను సాదించనేరక
వుంగిటి మొగమోటాన నుండితిఁ గాని

చ. 2:

దట్టమై నీ వింతేసి తలఁచే తలఁపులకు
అట్టె సగినాలు చెప్పి రల్లనాఁడె
వట్టి ఆసలను నేనే వాదువెట్టనేరక
గుట్టు సేసుకొని యింత కొంకితిఁ గాని

చ. 3:

గుమితాన నింతసేసి కూడుదువు నన్ను నని
అమరఁ గలలు గని రల్లనాఁడె
తమితో శ్రీవెంకటేశ తగ నట్టె కూడితివి
సమరతి నేనే నిన్ను జట్టి గొంటిఁ గాని