పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0283-1 భూపాలం సం: 09-193

పల్లవి:

రమణుని చిత్త మింతే రాఁపులు మాతో నేల
సమముగాఁ జూడు మని చండిసేయవచ్చునా

చ. 1:

పంతపు నీమాటలకు పనిలేదు మాతోను
చెంతలఁ బతికె బుద్ది చెప్పరాదా
యెంతలేదు నీసణఁగు యేల వాదుకు వచ్చేవు
బంతిఁబెట్టి వలపులు పంచిపెట్ట వచ్చునా

చ. 2:

జంకెన బొమ్మల మమ్ము సాదించఁ బనిలేదు
వంకల నీనేరుపుల వంచుకోరాదా
మంకుల నీగుణములు మాకుఁ గొత్తలా నేఁడు
అంకెలుగా నీమనసు అంటించ వచ్చునా

చ. 3:

యీడుకుగా మాతోను యింతసేయఁ బనిలేదు
ఆడుకోలు గలిగితే ననరాదా
యీడనె శ్రీవెంకటేశుఁ డిరవై నన్నుఁ గూడె
వేడుకకూటములకు వెలవెట్టవచ్చునా