పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0282-5 లలిత సం: 09-191

పల్లవి:

నాటి సుద్దులె వింటిమి నేటి సుద్దులు గంటిమి
పాటింప నావేడుకలు ప్రత్యక్షమైవున్నవి

చ. 1:

ఆదనఁ గోనేటిదండ హరి గూచుండి చూడఁగ
యెదుటనె జలకేలి నింతు లుండఁగా
కదిసి యమునలోన కందువైన గోపికలు
పొదిగి వలపుచల్లే పోలికయై వున్నది

చ. 2:

అంతలోనె వలువలు అందరుఁ గట్టుక వచ్చి
చెంత నితని కొలువు సేయఁగాను
చింతదీరఁ దొల్లి అందె చీర లిన్ని నిప్పించుక
సంతసాన నిట్లుండే సరవినే వున్నది

చ. 3:

అట్టె శ్రీవెంకటేశుఁ డలమేల్మంగనుఁ గూడి
నెట్టన పైఁడిమేడలో నిండు కుండఁగా
ఱట్టుగా వీ రిందరు నాఱడిసేసి నవ్వఁగాను
తెట్టెలై నాటి పొందులు తెలిపి నట్టున్నది