పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0282-3 శంకరాభరణం సం: 09-189

పల్లవి:

తనివారఁ దిరువనందలము సేవ నేఁడు
అనువుగా సేవించరో అమరులు ఋషులు

చ. 1:

యెదురుగాఁ గూచుండి యిద్దరు నందల మెక్కి
కదిసి మీఁదఁ బన్నాగము గట్టించి
ముదమున నొండొరులు మోములు చూచుకొంటా
యిదివో దేవులు దేవుఁ డేఁగేరు వీధులా

చ. 2:

చదురులమాఁటలు సతు లాడఁగా వింటా
వుదుటునఁ దమ యంగా లొరయఁగను
అద నెరిఁగి మోవుల నంతలో నవ్వులు నవ్వి
యెదు రెదుర దంపతు లేఁగేరు వీధులా

చ. 3:

పొదిగి యలమేల్మంగ పూఁచి కాఁగిలించఁగాను
కదలక కూడీ శ్రీవెంకటేశ్వరుఁడు
అదివో యాతఁడు మెచ్చె నాతని నాపె మెచ్చె
యెదిగి నగరిలోనె యేఁగేరు వీధులా