పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0282-2 శ్రీరాగం సం: 09-188

పల్లవి:

తరుణి యిందుకే తలవంచె
సరసము లెటువలె జరపితివో

చ. 1:

పంతము లాడుచుఁ బరతెంచిన చెలి
చెంతల నినుఁ గని సిగ్గువడె
మంతు కెక్కి కనుమరఁగులలోనె
యెంత సేసితివో యే మంటివో

చ. 2:

జంకెల బొమ్మల జరసే నని సతి
అంకెల నినుఁ గని అరమఱచె
సంకెలేని నీ చాయలలోనె
వుంకువ నీ వెట్లుండితివో

చ. 3:

అటు నినుఁ గలయుచు నలమేలుమంగ
నటనల నినుఁ గని నవ్వె నదే
చిటిపొటి రతులను శ్రీవెంకటేశ్వర
యెటువలె నొకటయి యెనసితివో