పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0281-6 దేసాళం సం: 09-186

పల్లవి:

ఎవ్వరి నేమనఁ జాల విది యేఁటిదో
అవ్వలి యివ్వలి భావ మది యేఁటిదో

చ. 1:

కందువ నీ కాపె చూపి కాఁకలు నీ మీఁదఁ జల్లి
అందపు ముసుఁగు వెట్టె నది యేఁటిదో
యింద మని విడె మిచ్చి యియ్యకోలు మాటలాడి
యిందె నిలుచుకున్నది యిది యేఁటిదో

చ. 2:

సెలవు నీ కాపె సేసి చేతులు నీ మీఁదఁ జాఁపి
అలసి పండున్న దాపె అది యేఁటిదో
మలఁగు నీకు వేసి మరి తానూ నం దొరగి
యెలమి నూరకేవున్న దిది యేఁటిదో

చ. 3:

చక్కని భూకాంత యాపె చనవు నీ మీఁదఁ జూఁపి
అక్కర నీ వీఁపెక్కె నది యేఁటిదో
గక్కన శ్రీవెంకటేశకైకొని నీ వురమెక్కె
యిక్కువ నలమేల్మంగ యిది యేఁటిదో