పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0281-5 శ్రీరాగం సం: 09-185

పల్లవి:

ఎవ్వరిపై మోహ మెట్టు దెలుసు మరి
యివ్వల నాతో నెనసితివి

చ. 1:

మందపు నడపుల మగువ రాకలకు
పొందుగ రమణుఁడ పొగడేవు
కందువ వేరొక కాంత చూడఁగా
చిందెటి చెమటలఁ జెలఁగేవు

చ. 2:

చతురత నొకసతి సరసము లాడఁగ
మితిమీరఁగ నిటు మెచ్చేవు
తతిగొని వేరొక తరుణి నవ్వఁగా
యితవులాడి చన విచ్చేవు

చ. 3:

వంతుకు నొకచెలి వలపులు చల్లఁగ
చెంతల సన్నలు సేసేవు
యింతలో శ్రీవెంకటేశ నేఁ గూడఁగ
సంతమై నాకె సత మయితివి