పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0281-3 సాళంగనాట సం: 09-183

పల్లవి:

ఎంతటివాఁడవు నిన్ను నేమందును
కాంతలకు మాకుఁ దొల్లి కారణము గలదా

చ. 1:

ఆపె నీకె మొక్కనీ ఆపెకు నీవైనా మొక్కు
కేపున మాకేఁటికి మొక్కించేవయ్యా
యేపున నే నేమంటి యీయింతి నన్నేమనె
చేపట్టి నీకొర కింత సేసేవు గాకా

చ. 2:

ఆవిడెము నీ వందుకో నీవిడె మట్టె పెట్టు
యీవల నెవ్వరి విడే లేమి సేసేము
యేవూరి యక్కను నేను యేవూరి చెల్లె లాపె
వావులు నీవల్ల నింతవచ్చె నింతె కాకా

చ. 3:

చేయివట్టి తియ్యనీ చేసన్న నీవు సేయి
బాయిట మ మ్మెపుడూనుఁ బట్టవద్దు
పాయ వలమేల్మంగను పైకొంటి శ్రీవెంకటేశ
కాయకపువారి నీవే కట్టుకొందు గాకా