పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0281-1 నాదరామక్రియ సం: 09-181

పల్లవి:

మనసుమెత్తనిదాన మరి నీకు మోహింతు
పనుపడి నీవెట్టు పాలార్చేవయ్యా

చ. 1:

సరసపు నీమాటకు జంకించితి నీవంతలో
వొరసి చిన్నఁబోయి వూరకుంటివి
కరఁగితి నదిచూచి కరుణ మిక్కిలిఁబుట్టి
తిరుగ నామన సెట్టు తేరిచేవయ్యా

చ. 2:

చేయి నామీఁద వేయఁగా సెలసి విదలించితి
చాయసేసుకో లోఁగి జడిసితివి
ఆయా లంటి చింతించితి అంతసేసితి నే నని
కాయ మంటి నన్ను నెట్టు గారవించేవయ్యా

చ. 3:

నీవు నన్నుఁ గూడఁగాను నివ్వెరగుతోఁ జొక్కితి
నీవె తప్పు లెంచుకొని నేర నంటివి
శ్రీవెంకటేశ యిందుకే సిబ్బితి యింతయుఁ బాసె
చేవగా నా చన వెట్టు చెల్లించేవయ్యా