పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0280-5 దేవగాంధారి సం: 09-179

పల్లవి:

పొద్దుగూఁకె తెల్లవారె పొంతనె యాతఁడున్నాఁడు
గద్దరితన మింతేసి కలదటవే

చ. 1:

చిత్త మెడసివున్నది చెప్పుడు మాటలవల్ల
వొత్తి యాతఁ డేమనిన వూఁకొనవు
అత్తివున్న చెలుల మమ్మడుగవే సుద్దులును
యిత్తలఁ దేరే వివర మెటువలెనే

చ. 2:

పట్టిన చలమున్నది పాసిన కాఁకలవల్ల
జట్టిగొని వేఁడుకొన్నా సమ్మతించవు
అట్టె యాతనిచే నొక్క ఆనైనఁ బెట్టించుకోవు
గుట్టుతో నుండఁగాను కూడు టెన్నఁడే

చ. 3:

పంత మెక్కుడైవున్నది బలు రారాఁపులవల్ల
కొంత గొంత సమ్మతించి కొంకుదేరవు
యింతలో శ్రీవెంకటేశుఁ డిదెరిఁగి నిన్నుఁ గూడె
వింత రతులనుచు నివ్వెరగు లేలే