పుట:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0280-4 హిందోళవసంతం సం: 09-178

పల్లవి:

ఇంతవాఁడు చెనకీ నెక్కడ చూచేవె నీవు
యింతలో గోడచిత్తరు వేమి వ్రాసేవే

చ. 1:

ఆతల నీరమణుఁడు అట్టె నిలుచుకుండఁగా
యేతుల మాతో మాటాడే విది యేఁటిదే
బూతులఁ దిట్టీ నతఁడు పూని నీగర్వము చూచి
యీతల నేఁటి నవ్వులు యిటు నవ్వేవే

చ. 2:

రతికి నాతఁడు నిన్ను రమ్మని పిలువఁగాను
కత లడిగేవు మమ్మిక్కడ నేటిదే
చతురుఁడు సురటి నిచ్చట నిన్నుఁ దాఁకవేసె
వెతదీరఁ బుచ్చుకొని విసరుకొనే వేమే

చ. 3:

శ్రీవెంకటేశుఁడు నిన్ను చేరి కాఁగిలించఁగాను
వోవరిలో నన్ను నేల వుండు మనేవే
దేవుఁ డాతఁ డంతలోనె తెరవేసి నిన్నుఁ గూడె
చేవదేరె నాతో నేల సిగ్గు వడేవే